E-PAPER

సర్’ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్ల తొలగింపు కుట్రలను అడ్డుకోవాలి: ఏజే రమేష్

భద్రాచలం, జూన్ 28:

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో బీజేపీ వ్యతిరేక మైనార్టీ, గిరిజన, దళిత, క్రిస్టియన్ ఓట్లను తొలగించే కుట్రలు జరుగుతున్నాయని, వాటిని అడ్డుకునేందుకు బూత్ లెవల్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ పిలుపునిచ్చారు.

ఆదివారం భద్రాచలంలోని చందర్రావు భవన్‌లో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన నిర్వహించిన శాఖ కార్యదర్శుల సమావేశంలో ఏజే రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఇప్పటివరకు SIR అమలు చేసిన రాష్ట్రాల్లో భారీగా ఓట్లు గల్లంతయ్యాయని ఆయన ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొలగించడం వల్ల బీజేపీ కూటమి పార్టీలకు లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందనడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు.

అర్హత కలిగిన ఓటర్ల హక్కులను కాపాడడంలో బూత్ లెవల్ ఏజెంట్ల పాత్ర కీలకమని, ఇప్పటికే ఫారాల పంపిణీ ప్రారంభమైనందున ప్రతి ఓటరికి ఫారాలు అందేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. 90 రోజుల పాటు జరిగే SIR ప్రక్రియలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని కోరారు.

రాష్ట్రంలోని అర్హులైన ఓటర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కూడా ఉందని ఏజే రమేష్ పేర్కొన్నారు. SIR పేరుతో స్కీమ్ వర్కర్లను వేధించడం సరికాదని, అంగన్‌వాడీ, వీవోఏ తదితర ఉద్యోగులు తమ సాధారణ విధులు నిర్వహిస్తూనే ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల తీవ్ర పనిభారం ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బి. నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్‌బాబు, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు పారెల్లి సంతోష్ కుమార్, డి. సీతాలక్ష్మి, పట్టణ కమిటీ సభ్యులు నాదెండ్ల లీలావతి, జీవనజ్యోతి, ఉస్తెల జ్యోతి, కొలగాని రమేష్, ధనకొండ రాఘవయ్య, కుంజా శ్రీనివాస్, సండ్ర భూపేంద్ర, కనకశ్రీ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News