మంచిర్యాల, జూన్ 28 (వై7 న్యూస్):
మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూమి వివాదం కారణంగా అన్న తన తమ్ముడిని గొడ్డలితో నరికి హత్య చేసిన సంఘటన బెల్లంపల్లి మండలంలో కలకలం రేపింది.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామానికి చెందిన రాజేశ్ (32)కు అతని అన్న చందుతో భూమి విషయంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకోగా, ఆవేశానికి లోనైన చందు గొడ్డలితో రాజేశ్‌పై దాడి చేశాడు.
ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.







