E-PAPER

రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించాలి.. లేకుంటే ప్రజా, న్యాయ పోరాటం: భీమ్ మిషన్ ఐడియాలజీ

హైదరాబాద్, జూన్ 28 (వై7 న్యూస్):
ఎస్సీ వర్గీకరణ అనంతరం అమలులోకి వచ్చిన రోస్టర్ విధానాన్ని తక్షణమే పునఃసమీక్షించాలని, అప్పటి వరకు ప్రభుత్వం కొత్త ఉద్యోగ నోటిఫికేషన్‌లను నిలిపివేయాలని భీమ్ మిషన్ ఐడియాలజీ (బీఎంఐ) రాష్ట్ర ప్రతినిధుల సమావేశం డిమాండ్ చేసింది. సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమంతో పాటు న్యాయపోరాటం కూడా చేపడతామని హెచ్చరించింది.

హైదరాబాద్‌లో బీఎంఐ రాష్ట్ర అధ్యక్షుడు డి. సర్వయ్య అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన రాష్ట్ర ప్రతినిధుల సమావేశంలో పలు కీలక తీర్మానాలు ఆమోదించారు. సమావేశంలో ప్రతినిధులు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ తర్వాత విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్‌లలో మాల, మాల ఉపకులాలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

కొన్ని ప్రభుత్వ నియామకాల్లో సీ గ్రూపును పూర్తిగా పరిగణనలోకి తీసుకోకపోగా, మరికొన్ని నోటిఫికేషన్‌లలో ఒక్క పోస్టు కూడా కేటాయించలేదని విమర్శించారు. ప్రస్తుతం అమలులో ఉన్న రోస్టర్ విధానంలో సీ గ్రూపుకు కేటాయించిన 22వ రోస్టర్ పాయింట్‌ను 16వ రోస్టర్ పాయింట్‌కు మార్చాలని బీఎంఐ డిమాండ్ చేసింది.

ఈ విధానం కొనసాగితే సీ గ్రూపుకు చెందిన విద్యార్థుల విద్యా అవకాశాలు, యువత ఉద్యోగ అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని, మాల సమాజం మరింత వెనుకబడే ప్రమాదం ఉందని నాయకులు పేర్కొన్నారు. రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించాలని, అప్పటి వరకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్‌లను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ అంశంపై మాల సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు బీఎంఐ ప్రకటించింది. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర అధ్యక్షుడు డి. సర్వయ్య స్పష్టం చేశారు.

సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎం. లక్ష్మీనారాయణ, డా. మంచాల లింగస్వామి, ఆవుల సుధీర్, కే. శంకర్, హర్ష మల్లేశం, చి. వెంకటేశ్వర్లు, మాణిక్యం, ముక్కంటి, ఆస శ్రీరాములు, దాసరి విశాల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాల కన్వీనర్లు, సామాజిక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్మానాలకు మద్దతు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News