15 క్వింటాళ్ల హామీ.. 2 క్వింటాళ్ల దిగుబడి – రైతులను నట్టేట ముంచిన సీడ్ కంపెనీలు..!
ఏజెన్సీలో పీసా చట్టాలకు తూట్లు.. అమాయక రైతులపై విత్తనాల పేరుతో భారీ మోసం..!
మాయమాటలు, బెదిరింపులతో భూముల బదిలీ?.. డీలర్లు, కంపెనీలపై చర్యలకు డిమాండ్..!
నకిలీ సీడ్ దందాపై భగ్గుమన్న ఆదివాసీలు.. బాధ్యుల అరెస్ట్ చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్!
కరకగూడెం,జూన్ 27 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (వై సెవెన్ తెలుగు న్యూస్,)
ఏజెన్సీ ప్రాంతంలో నకిలీ విత్తనాల మోసం.. ఆదివాసీ రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని 5వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతంలో నకిలీ విత్తనాల పేరుతో ఆదివాసీ రైతులను మోసం చేసి తీవ్ర ఆర్థిక నష్టాలకు గురిచేశారని బాధిత రైతులు వ్యవసాయ శాఖ అధికారి ఏ,వో సెటర్జి వారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జేఏసీ ఆదివాసి మండల అధ్యక్షులు, గొగ్గల కృష్ణ మాట్లాడుతూ . భూబదలాయింపు నిషేధ చట్టాలు 1/59, 1/70తో పాటు పీసా (PESA) చట్టం వ్యవసాయ శాఖ ఉన్న ఈ ఏజెన్సీ ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలు చట్టబద్ధంగా సాగాల్సి ఉండగా, కొందరు కంపెనీలు అమాయక ఆదివాసీ రైతులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు హామీలతో విత్తనాల వ్యాపారం నిర్వహించాయని పేర్కొన్నారు.
రైతులకు ఎకరానికి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని నమ్మించి విత్తనాలు విక్రయించారని తెలిపారు. అయితే పంట చేతికొచ్చే సమయానికి ఎకరానికి కేవలం 2 నుంచి 3 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే రావడంతో భారీ నష్టాలు వాటిల్లాయని వాపోయారు. నారు పోసి, దమ్ము చేసి, కొంతభాగంలో నాట్లు వేసిన అనంతరం కంపెనీ ప్రతినిధులు విత్తనాల సరఫరా నిలిపివేశారని, సమయం దాటిపోవడంతో మిగిలిన పొలాల్లో నాట్లు వేయలేక మరోసారి నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా పంటలకు బీమా సౌకర్యం కల్పించకపోవడంతో పూర్తిగా అప్పుల పాలయ్యామని తెలిపారు. కొందరు రైతులను బెదిరించి, మాయమాటలు చెప్పి వారి భూములను కంపెనీల పేర్లపై రాయించుకున్న ఘటనలు కూడా జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సంబంధిత కంపెనీల నిర్వాహకులు, నిర్వాహక ప్రతినిధులు, అలాగే కరకగూడెం మండలం అనంతారం గ్రామానికి చెందిన డీలర్ కొమ్మ శివ (శంకరయ్య కుమారుడు)పై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ఆదివాసీ రైతులకు తక్షణ పరిహారం, పంట నష్టపరిహారం, భూముల రక్షణతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని,వ్యవసాయ శాఖ జిల్లా అధికారులను బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు.








