భద్రాచలం, జూన్ 27 (వై7 న్యూస్): సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అరెస్టును సిపిఐ రాష్ట్ర నాయకుడు రావులపల్లి రవికుమార్ తీవ్రంగా ఖండించినట్లు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ప్రజల తరఫున పోరాడుతున్న నాయకులను నిర్బంధించడం ద్వారా ప్రజల గొంతును అణచివేయాలనే ప్రయత్నాలు సరైనవి కావని అన్నారు.
ఈ ఖండనకు భద్రాచలం సిపిఐ పట్టణ సమితి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు నాయకుడు కంభం మెట్టు శ్రీనివాస్ తెలిపారు. ప్రజాస్వామ్య హక్కులను గౌరవిస్తూ కూనంనేని సాంబశివరావును వెంటనే విడుదల చేయాలని, ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకులపై అక్రమ అరెస్టులు, నిర్బంధ చర్యలను ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని ఆయన కోరారు.








