భద్రాచలం, జూన్ 27: భద్రాచలంలో జూలై 12న నిర్వహించనున్న మాలల మహా ర్యాలీని విజయవంతం చేయాలని మాలమానాడు నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు భద్రాచలంలోని మాలమానాడు కార్యాలయంలో ర్యాలీ కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ దామాల సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి పాల్రాజ్ మాట్లాడుతూ, రోస్టర్ విధానంలో మాలలకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మాలల హక్కులు, అవకాశాల పరిరక్షణ కోసం సమాజం అంతా ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
జూలై 12న జరిగే మాలల మహా ర్యాలీ, మహాసంగ్రామాన్ని విజయవంతం చేసి తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా నాయకులు బుయ్యన వీరబాబు, పోలవరం మాలమానాడు జిల్లా అధ్యక్షుడు కురినాల వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వరదా బ్రహ్మం, రిటైర్డ్ అధికారి నూకబోయిన నర్సింహా, వరదా సాయి తదితరులు పాల్గొన్నారు.








