E-PAPER

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు: నాంపల్లి కోర్టు విచారణకు గైర్హాజరైన అల్లు అర్జున్

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్యా థియేటర్‌ వద్ద ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన విషాదకర తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం నేరుగా హాజరుకావాలని నాంపల్లి కోర్టు.. సినీ నటుడు అల్లు అర్జున్‌కు గతంలో సమన్లు జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశించినప్పటికీ ఆయన విచారణకు స్వయంగా హాజరుకాలేదు. ఆయనకు బదులుగా అల్లు అర్జున్ లీగల్ టీమ్ కోర్టుకు హాజరై, ఆయన గైర్హాజరీపై న్యాయమూర్తి ముందు వివరణ సమర్పించింది.

ప్రస్తుతం అల్లు అర్జున్.. దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తన తదుపరి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారని, అందుకే ఆయన కోర్టుకు రాలేకపోయారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ముంబైలో కీలకమైన షూటింగ్ జరుగుతున్నందున ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని లాయర్లు కోరారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్ (వర్చువల్) విధానం ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని వారు కోర్టులో ఆబ్సెంట్ పిటిషన్ వేశారు.

2024 డిసెంబర్ 4న జరిగిన ఈ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. భద్రతా వైఫల్యాలు, ముందస్తు అనుమతులు లేకుండా ఈవెంట్ నిర్వహించడంపై దర్యాప్తు చేసిన చిక్కడపల్లి పోలీసులు.. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా (A11) చేరుస్తూ చార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ కేసులో కోర్టు సమన్లు జారీ చేయగా, తాజాగా అల్లు అర్జున్ నేరుగా హాజరుకాకపోవడంతో ఈ కేసు తదుపరి లీగల్ ప్రొసీడింగ్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News