భారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయానికి సమయం ఆసన్నమైంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ముంబై – అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ (బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్) పనులు శరవేగంగా దూసుకుపోతున్నాయి. గంటకు ఏకంగా 320 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ బుల్లెట్ రైలు, కేవలం 9 నిమిషాల్లోనే 50 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించగలదని అధికారులు వెల్లడించారు. ఎంతో కాలంగా దేశప్రజలు ఎదురుచూస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ లోని మొదటి విడత సర్వీసులు 2027 నాటికే అందుబాటులోకి రానున్నాయి.
గుజరాత్‌లోని సూరత్ నుండి బిలిమోరా మధ్య ఉన్న 50 కిలోమీటర్ల సెక్షన్లో ఈ బుల్లెట్ రైలు మొదటి ట్రయల్ రన్ మరియు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. జపాన్ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న ఈ రైలు మార్గం కోసం వయాడక్ట్‌ల నిర్మాణం, ట్రాక్‌ల ఏర్పాటు దాదాపు పూర్తి కావచ్చాయి. ముంబై-అహ్మదాబాద్ మధ్య మొత్తం 508 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ కారిడార్ పూర్తయితే, సాధారణంగా పట్టే 6 గంటల ప్రయాణ సమయం కాస్తా కేవలం 2 గంటలకు తగ్గిపోనుంది.
ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని, రవాణా రంగాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. గాలి వేగంతో దూసుకెళ్లే ఈ రైళ్లలో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అత్యాధునిక ఆటోమేటిక్ ప్రొటెక్షన్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 2027లో గుజరాత్ పరిధిలో ప్రారంభమయ్యే ఈ హైస్పీడ్ రైలు సేవలను, ఆ తర్వాతి కాలంలో మహారాష్ట్ర కనెక్టివిటీతో కలిపి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (NHSRCL) రాత్రింబగళ్లు శ్రమిస్తోంది.








