E-PAPER

విద్యారంగాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం: ఏఐఎస్ఎఫ్ ఆగ్రహం

అశ్వాపురం;
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని, తాజా బడ్జెట్‌లో కేటాయించిన నిధులు చూస్తే ఇదే స్పష్టమవుతోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఈనపల్లి పవన్ సాయి ఆరోపించారు.శనివారం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర 2026-27 బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 8.22 శాతం నిధులు మాత్రమే కేటాయించడం తీవ్ర నిరాశ కలిగిస్తోందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కనీసం 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఆ హామీని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు.రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్లు పెండింగ్‌లో ఉన్న రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్‌ల సమస్యను పట్టించుకోకుండా కేవలం ₹4,343 కోట్లు మాత్రమే కేటాయించడం సరైన విధానం కాదన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
యంగ్ ఇండియా సమీకృత గురుకులాలకు భారీగా నిధులు కేటాయించినప్పటికీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల పరిస్థితిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. అలాగే సంక్షేమ వసతి గృహాలు, కస్తూరిబా పాఠశాలలు, డిగ్రీ కాలేజీలు, అంతర్జాతీయ పాఠశాలల భవనాల నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం లేకపోవడం దురదృష్టకరమన్నారు. విద్యారంగ అభివృద్ధికి అవసరమైన విధంగా నిధులు కేటాయించకుండా ఉండడం వల్ల రాష్ట్రం విద్యా దారిద్ర్యానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కనీసం 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు చేపడతామని పవన్ సాయి హెచ్చరించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!