నిర్మల్,సెప్టెంబర్23 వై సెవెన్ న్యూస్
తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో, నిర్మల్ జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్‌లో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టి.జే.ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ,ప్రపంచ చరిత్రలో తెలంగాణ ఉద్యమం మహోన్నతమైనదని, సకల వర్గాలు,ప్రజలు ఏకమై ఉద్యమం చేస్తేనే రాష్ట్రం ఏర్పడిందని,తెలంగాణ ఉద్యమంలో మనం అందరం పాల్గొన్నాం, కానీ, కే సి ఆర్ తాను ఒక్కడినే తెలంగాణ ఉద్యమం చేసినట్టు చిత్రీకరించుకొని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్లుగా నియంతృత్వ పాలన కొనసాగించారని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలంతా ఏకమై కేసీఆర్ ని ఓడించారని అన్నారు.అదేవిధంగా, ప్రస్తుత ప్రభుత్వంపై వ్యాఖ్యానిస్తూ,ఇప్పుడు రాష్ట్రంలో స్వేచ్ఛా వాతావరణం ఉంది. ప్రజలు పాలకులను సులభంగా కలిసి తమ సమస్యలను వినిపించుకోవడానికి అవకాశం కలిగింది అని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు.భారత రాజకీయాల్లోనూ ఖర్పూరి ఠాగూర్ వంటి నిబద్ధత కలిగిన నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని, తెలంగాణలో గుమ్మడి నర్సయ్య వంటి వారికి మనం ఆదర్శంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.పైసలు లేని రాజకీయాల కోసమే తెలంగాణ జన సమితి పార్టీ ఏర్పాటు చేసుకున్నాం అని ఆయన స్పష్టం చేశారు.
ఎప్పుడూ ప్రతిపక్షంగా పోరాడిన మనం, ఇప్పుడు మొదటిసారి ప్రభుత్వంలో భాగస్వామ్యం పొందే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ప్రజల సంక్షేమం కోసం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుదాం అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమ ముగింపులో పలు సమస్యలపై విజ్ఞాపన పత్రాలు అందజేశారు.వాటిని పరిశీలించి, సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాను అని ప్రొఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు.