ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని, మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై, మెయిన్స్ కోసం సన్నద్ధమవుతున్న 135 మంది అభ్యర్థులకు ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పేరిట రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కులను సీఎం అందించారు . రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నట్లు చెప్పిన రేవంత్ రెడ్డి, సివిల్స్ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలని ఆకాంక్షించారు.
చదువుకు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా వర్సిటీ ద్వారా 2 వేల మందికి శిక్షణ ఇస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి శిక్షణ ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. 2028 ఒలింపిక్స్లో రాష్ట్ర అథ్లెట్లకు అత్యధికంగా పతకాలు వచ్చేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం వర్సిటీలను నిర్వీర్యం చేసిందన్న ముఖ్యమంత్రి, త్వరలోనే వర్సిటీలకు నూతన వైస్ ఛాన్స్లర్లను నియమిస్తామని తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులను రెచ్చగొట్టి, పరీక్షల వాయిదాలకు పట్టుబట్టారని మండిపడ్డారు. ఇంతకు ముందులా నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నట్లు రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. పరీక్షలు వాయిదా వేస్తే నిరుద్యోగులకే నష్టమన్న ఆయన, ఏమైనా సమస్యలుంటే నిరుద్యోగులు చెప్పింది వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు.
