‘సెల్ఫ్ డిక్లరేషన్’ నిబంధనలకు పాతర!..
టెండర్లకు చిక్కకుండా పనుల ముక్కలు..
అగ్రిమెంట్లు లేకుండానే బిల్లుల మాయాజాలం!
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి, Y7 న్యూస్ తెలుగు:
ప్రభుత్వ ఖజానాకు కాపలా కాయాల్సిన కొందరు విద్యుత్ శాఖ అధికారులు, తామే స్వయంగా పెట్టుబడిదారులుగా మారి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. క్షేత్రస్థాయి నుండి డివిజన్ స్థాయి వరకు ఒకే సామాజిక వర్గానికి చెందిన కొందరు అధికారులు సిండికేట్‌గా మారి, తమ దగ్గరి బంధువులను బినామీ కాంట్రాక్టర్లుగా రంగంలోకి దించి కాంట్రాక్టుల దందాకు తెరలేపారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాచలం డివిజన్ లోని
మూడు కీలక సెక్షన్ల పరిధిలో సాగుతున్న ఈ అక్రమాల పరంపర ఇప్పుడు స్థానిక కాంట్రాక్టర్ల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక సెక్షన్లో అసిస్టెంట్ ఇంజనీర్ (AE)గా విధులు నిర్వహిస్తున్న అధికారి, తన కుర్చీ పలుకుబడిని అడ్డుపెట్టుకుని స్వంత బావమరిదిని తెరపైకి తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు అధికారి ఇక్కడ బాధ్యతలు చేపట్టిన తర్వాతే, అతని బావమరిది తన తండ్రి పేరు మీద క్లాస్-3 కాంట్రాక్ట్ లైసెన్స్ తీసుకోవడం వెనుక భారీ మతలబు ఉందనే ప్రచారం జరుగుతోంది. అధికారులే తెరవెనుక పెట్టుబడులు పెడుతూ, ఆ సెక్షన్‌తో పాటు పక్కనే ఉన్న మరో రెండు సెక్షన్లలోనూ సింహభాగం పనులను తమ బినామీ ఖాతాలోకి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం తన లైసెన్స్‌పైనే కాకుండా, మరో కాంట్రాక్టర్ లైసెన్స్‌పై జరిగే పనులకు కూడా సదరు బినామీయే లేబర్, స్తంభాలను సరఫరా చేస్తూ శాఖలో చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.
విద్యుత్ శాఖ (TGNPDCL/TGTRANSCO) నిబంధనల ప్రకారం ప్రతి కాంట్రాక్టర్ అగ్రిమెంట్ సమయంలో ‘అనెక్సర్-1’ (Self Declaration) పత్రాన్ని సమర్పించాలి. శాఖ నిబంధనల జాబితా (Annexure-III) ప్రకారం బావమరిది, అల్లుడు, తండ్రితో పాటు కాంట్రాక్టర్‌పై ఆధారపడిన వారందరూ ‘బంధువుల’ పరిధిలోకి వస్తారు. ఒకవేళ శాఖలో పనిచేసే బంధువుల వివరాలను దాచిపెట్టి తప్పుడు డిక్లరేషన్ ఇస్తే, సదరు కాంట్రాక్టును తక్షణమే రద్దు చేయడంతో పాటు నష్టపరిహారం వసూలు చేసే అధికారం శాఖకు ఉంటుంది. అలాగే సర్వీస్ రూల్స్ ప్రకారం బంధువులకు పనులు కట్టబెట్టడం అధికారికి కూడా సస్పెన్షన్‌కు దారితీసే తీవ్రమైన నేరం. అయినప్పటికీ, డివిజన్ స్థాయి ఉన్నతాధికారుల అండదండలతో ఇక్కడ నిబంధనలు ఏమాత్రం పనిచేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, పెద్ద పనులకు ఓపెన్ టెండర్లు పిలిస్తే నిజమైన కాంట్రాక్టర్లు పోటీ పడతారనే ఉద్దేశంతో, పనులను చిన్న చిన్న ముక్కలుగా విభజించి (Splitting of Works) కొటేషన్ల పేరుతో నెలకు ఇరవై నుండి ముప్పై లక్షల రూపాయల 30 నుండి 50 పనుల వరకు ఒకే కాంట్రాక్టర్‌కు కట్టబెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం వర్క్ ఆర్డర్, అగ్రిమెంట్ పూర్తయిన తర్వాతే పనులు ప్రారంభించాల్సి ఉండగా, ఇక్కడ ముందుగా పనులు పూర్తి చేయించి ఆ తర్వాత తీరిగ్గా బ్యాక్-డేట్ అగ్రిమెంట్లు చేస్తూ బిల్లులు మంజూరు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకే క్లాస్-3 కాంట్రాక్టర్ పేరు మీద ఇన్ని కొటేషన్లు పంపితే తాము నష్టపోతున్నామని, డివిజనల్ ఆఫీసులో నెలకు ఇన్ని అగ్రిమెంట్లు ఎలా చేస్తున్నారని తోటి కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
అధికారుల పెట్టుబడులతో సాగుతున్న ఈ వర్క్ ఆర్డర్ల చిట్టాను బయటకు తీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, సదరు అక్రమార్కులు తమ పలుకుబడితో వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఈ తీవ్ర ఆరోపణలపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, విజిలెన్స్ విభాగం ఎలా స్పందిస్తారో, బినామీ దందాకు అడ్డుకట్ట వేస్తారో లేదో వేచి చూడాలి.








