E-PAPER

క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..! 70 శాతం వరకు తగ్గే ఛాన్స్..

క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరల నియంత్రణ పరిధిలో లేని అన్ని క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేసింది. ఈ నిర్ణయంతో కొన్ని మందుల గరిష్ఠ చిల్లర ధరలు (ఎంఆర్‌పీ) 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల రోగులకు ఏటా సుమారు రూ.2,500 కోట్ల వరకు ఆదా అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.

ఈ నిర్ణయం బ్రాండెడ్, జనరిక్ మందులతో పాటు దేశీయ, దిగుమతి మందులకూ వర్తిస్తుంది. పేటెంట్ ఉన్నవి, లేనివి కూడా ఇందులోకి వస్తాయి. మందుల సరఫరా వ్యవస్థలో అధిక లాభాలను నియంత్రించడంతో పాటు క్యాన్సర్ చికిత్సను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రం ఈ చర్య చేపట్టింది.

సుప్రీంకోర్టు ప్రశ్నల నేపథ్యంలో
క్యాన్సర్ మందుల ధరలపై సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 29న జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం కీలక ప్రశ్నలు వేసింది. ఓ క్యాన్సర్ మందును రిటైలర్లకు సుమారు రూ.2,700కు సరఫరా చేస్తుండగా.. దాని ఎంఆర్‌పీ రూ.27,000గా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది.

మందులపై ఒకే విధమైన మార్జిన్‌ను నిర్ణయించలేమా అని కేంద్రాన్ని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ పథకాల కింద చికిత్స పొందుతున్న వారికి ఆసుపత్రుల్లోని సొంత ఫార్మసీల నుంచే మందులు కొనాలని చెప్పడంపైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై అక్టోబర్ 12న మరోసారి విచారణ జరగనుంది.

2019లోనూ ఇదే విధానం
ట్రేడ్ మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేయడం ఇదే తొలిసారి కాదు. 2019లో 42 నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ మందులపై జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) 30 శాతం మార్జిన్‌ను అమలు చేసింది. దీంతో 526 బ్రాండ్ల ఎంఆర్‌పీలు సగటున 50 శాతం తగ్గాయని కేంద్రం తెలిపింది. అప్పట్లో రోగులకు ఏటా సుమారు రూ.984 కోట్ల మేర ఆదా అయినట్లు అంచనా.

తాజా నిర్ణయంతో కొన్ని మందుల ధరలు 70 శాతం వరకు తగ్గొచ్చని కేంద్రం చెబుతోంది. 2026 మార్చి నాటికి 131 క్యాన్సర్ మందులకు ఎన్‌పీపీఏ ధర పరిమితులు అమల్లో ఉన్నాయి. జన ఔషధి వంటి పథకాలు, కస్టమ్స్ సుంకాల తగ్గింపుతోనూ క్యాన్సర్ చికిత్స ఖర్చును తగ్గించే చర్యలు కొనసాగుతున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!