E-PAPER

అంతరిక్షంలోకి విస్కీ..! శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం..

విస్కీని సాధారణంగా ఓక్‌ పీపాల్లో ఏళ్ల తరబడి నిల్వ చేస్తారు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు అంతరిక్షంలో విస్కీని ‘ఏజ్‌’ చేయాలని సిద్ధమవుతున్నారు. భూమికి దూరంగా, గురుత్వాకర్షణ దాదాపు లేని పరిస్థితుల్లో విస్కీ ఎలా మారుతుందో తెలుసుకునేందుకు ఈ ప్రయోగం చేపట్టనున్నారు.

స్కాట్లాండ్‌, జపాన్‌కు చెందిన ఇంజినీర్లు కలిసి ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. ‘స్పేస్‌ పఫిన్‌’గా పిలుస్తున్న ఈ ప్రయోగాన్ని 2028లో చేపట్టాలని నిర్ణయించారు. చిన్న ఉపగ్రహం క్యూబ్‌సాట్‌లో విస్కీ నమూనాలు, ముడి పదార్థాలను అంతరిక్షంలోకి పంపనున్నారు.

పీపాలకు బదులు ఓక్‌ ముక్కలు
సాధారణ ఓక్‌ పీపాలు చాలా బరువుగా, పెద్దగా ఉంటాయి. వాటిని ఉపగ్రహంలో తీసుకెళ్లడం సాధ్యం కాదు. దీంతో శాస్త్రవేత్తలు ప్రత్యేక మైక్రో కంటెయినర్లను రూపొందించారు. విస్కీని ఓక్‌ చెక్క ముక్కల్లో ఉంచి పీపాలో జరిగే ఏజింగ్‌ ప్రక్రియను చిన్న స్థాయిలో అనుకరించనున్నారు.

జీరో గ్రావిటీలో ఏం జరుగుతుంది?
అంతరిక్షంలో విస్కీలో జరిగే రసాయన మార్పులను పరిశీలించనున్నారు. ద్రవాల కదలిక, హీట్‌ ట్రాన్స్‌ఫర్‌పై గురుత్వాకర్షణ ప్రభావం ఎలా ఉంటుందో సెన్సర్ల ద్వారా గుర్తిస్తారు. భూమితో పోలిస్తే అంతరిక్షంలో ఓక్‌ చెక్క భిన్నంగా వ్యవహరించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో విస్కీ ఏజింగ్‌ ప్రక్రియ వేగంగా జరిగే అవకాశముంది.

స్పేస్‌ స్టేషన్‌ నుంచి కక్ష్యలోకి
2028లో స్పేస్‌ఎక్స్‌ మిషన్‌లో విస్కీని అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లాలని ప్రణాళిక. అక్కడి జపాన్‌ మాడ్యూల్‌ నుంచి దాన్ని కక్ష్యలోకి పంపనున్నారు. స్కాట్లాండ్‌ డిస్టిలరీలు, జపాన్‌ సంస్థలు విస్కీ నమూనాలను అందించనున్నాయి.

ఈ ప్రయోగం విజయవంతమైతే విస్కీ రుచికి కారణమయ్యే కొత్త రసాయన ప్రక్రియలు బయటపడే అవకాశం ఉంది. భవిష్యత్తులో భూమిపై విస్కీ తయారీ, ఏజింగ్‌ పద్ధతుల్లోనూ మార్పులకు ఇది దారితీయొచ్చు. రాబోయే మూడేళ్ల నుంచి ఐదేళ్లలో దాదాపు లీటర్‌ విస్కీని అంతరిక్షంలో తయారు చేసి భూమికి తీసుకురావాలన్న ఆలోచన కూడా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!