ములుగు, అక్టోబర్ 05 (Y7 News Telugu):
ములుగు జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని, తీసుకున్న చర్యలు మరియు అర్జీల పరిష్కార స్థితిని ఉన్నతాధికారులకు వెంటనే తెలియజేయాలని సూచించారు.


సోమవారం నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్, సంపత్ రావులతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వయంగా స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత శాఖల అధికారులకు దరఖాస్తులను అందజేసి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో మూడు దశల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రజావాణి, ప్రజా దర్బార్, గిరిజన దర్బార్‌తో పాటు అన్ని స్థాయిల్లో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, పరిష్కారానికి చేపట్టిన చర్యలు మరియు ప్రస్తుత స్థితిని ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ఫిర్యాదులో పేర్కొన్న సమస్య స్వరూపం, కారణాలు, పరిష్కారానికి అవసరమైన చర్యలను స్పష్టంగా పరిశీలించాలని తెలిపారు. సమస్య పరిష్కారం సాధ్యం కాకపోతే అందుకు గల కారణాలను కూడా ఫిర్యాదుదారులకు తెలియజేయాలని సూచించారు.
ప్రజావాణి కార్యక్రమంపై ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రతి అర్జీపై అధికారులు బాధ్యతాయుతంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. గత ప్రజావాణిలో అందిన దరఖాస్తుల పరిష్కార స్థితిని సమీక్షించి, పెండింగ్ అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
అలాగే నూతన సమీకృత కలెక్టరేట్‌లో శాఖలకు కేటాయించిన కార్యాలయాలను వెంటనే ప్రారంభించి, పరిపాలనా కార్యకలాపాలు కొనసాగించాలని సూచించారు. అన్ని శాఖలు తమ కార్యాలయాలను నూతన సమీకృత కలెక్టరేట్‌కు తరలించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని స్పష్టం చేశారు.
ఈ రోజు నిర్వహించిన ప్రజావాణిలో భూ సమస్యలకు సంబంధించి 8, ఇందిరమ్మ ఇళ్లకు 1, పింఛన్లకు 2, ఉద్యోగాలకు 9, ఇతర శాఖలకు 4 దరఖాస్తులు అందగా, మొత్తం 24 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.









