E-PAPER

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ; సీఐటీయూ గౌరవ సలహాదారు బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్

బూర్గంపాడు: భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ గౌరవ సలహాదారు బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

గురువారం సారపాకలోని సీఐటీయూ కార్యాలయంలో ఎస్. శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన లేబర్ ఇన్సూరెన్స్ విషయంలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. గతంలో లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు తీసుకున్న కార్మికులకు రెన్యువల్, అప్‌డేట్ సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.

భద్రాచలం, మణుగూరు ప్రాంతాలకు చెందిన కార్మికులను కార్యాలయాల చుట్టూ తిప్పుతూ, మళ్లీ కొత్తగా కార్డులు తీసుకోవాలని సూచిస్తున్నారని అన్నారు. దీంతో కార్మిక కుటుంబాలకు అందాల్సిన డెలివరీ, వివాహ, మరణ తదితర బెనిఫిట్స్ సకాలంలో అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తగా ఇన్సూరెన్స్ నమోదు చేసుకునే కార్మికులకు కూడా అనేక నిబంధనల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

చిన్నచిన్న సమస్యల కారణంగా కార్మిక కుటుంబాలకు అందాల్సిన సంక్షేమ ప్రయోజనాలు నిలిచిపోకుండా చూడాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే భవన నిర్మాణ కార్మికులను సమీకరించి సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ సమావేశంలో తోట మల్లయ్య, సీహెచ్ రమణయ్య, ఓర్సు పండు, నూనె వెంకన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!