రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే రష్యాకు సైనిక మద్దతు అందిస్తున్న ఉత్తర కొరియా.. ఇప్పుడు డ్రోన్ దాడి దళాలను కూడా రంగంలోకి దించినట్లు సమాచారం. రష్యాలోని కుర్స్క్ ప్రాంతానికి చేరుకున్న ఉత్తర కొరియా సైనికుల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రోన్ ఆపరేటర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం అంతర్జాతీయ సైనిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కుర్స్క్ రీజియన్‌లో ఇప్పటికే సుమారు 8,500 మంది ఉత్తర కొరియా సైనికులు మోహరించినట్లు సమాచారం. వీరిలో దాదాపు 400 మంది నైపుణ్యం కలిగిన డ్రోన్ ఆపరేటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆధునిక యుద్ధంలో డ్రోన్ల వినియోగం కీలకంగా మారిన నేపథ్యంలో, ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఈ దళాలను రష్యా తరఫున ఉపయోగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉక్రెయిన్ అంతర్గత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు నిర్వహించడమే ఈ ప్రత్యేక విభాగం ప్రధాన బాధ్యతగా ఉన్నట్లు సమాచారం. ఉత్తర కొరియా సైనికుల భాగస్వామ్యం ఇప్పటికే యుద్ధంలో కొత్త పరిణామాలకు దారితీస్తుండగా, డ్రోన్ ఆపరేటర్ల ప్రవేశం పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మార్చే అవకాశం ఉందని అంతర్జాతీయ మిలటరీ వర్గాలు భావిస్తున్నాయి.








