వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 52 మంది అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను కేటాయించినట్లు అధికారిక వర్గాల సమాచారం.
ఈ భద్రతా కవచం పొందిన వారిలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతితో పాటు పలువురు కీలక నేతలు ఉన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నేతలకు భద్రతాపరమైన ముప్పులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అధికారిక సమాచారం ప్రకారం.. ఒక్కో బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. మొదటి విడతలో 8 మంది నేతలకు, రెండో విడతలో మరో 44 మందికి వీటిని పంపిణీ చేసినట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.








