గల్ఫ్ దేశాలు తమకు మిత్రదేశాలని చెప్పుకునే పాకిస్తాన్‌కు తాజాగా ఊహించని పరిణామం ఎదురైంది. గల్ఫ్ దేశాలకు వచ్చే పాకిస్థానీయుల వల్ల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆయా దేశాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి జూలై 13 మధ్య గల్ఫ్ దేశాల నుంచి 20,000 మందికి పైగా పాకిస్థానీయులను బహిష్కరించినట్లు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో వెల్లడైన గణాంకాలు వెల్లడించాయి.
పాకిస్థాన్ నార్కోటిక్స్ కంట్రోల్ మంత్రిత్వ శాఖ అందించిన వివరాల ప్రకారం.. భద్రతా ఆందోళనలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనలు, క్రిమినల్ కేసులు తదితర కారణాలతో ఈ డిపోర్టేషన్లు జరిగినట్లు పేర్కొంది. గల్ఫ్ దేశాల్లో అత్యధికంగా సౌదీ అరేబియా 15,500 మంది పాకిస్థానీయులను వెనక్కి పంపింది. ఇటీవల పాకిస్తాన్‌తో సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
సౌదీ అరేబియా తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) 3,803 మంది పాకిస్థానీయులను డిపోర్ట్ చేసింది. ఇతర GCC దేశాల్లోనూ పలువురిని వెనక్కి పంపారు. ఒమన్ 1,606, బహ్రెయిన్ 521, ఖతార్ 429, కువైట్ 97 మంది పాకిస్థానీయులను బహిష్కరించినట్లు గణాంకాలు వెల్లడించాయి. దీంతో గల్ఫ్ దేశాల్లో పాకిస్థానీయులపై భద్రత, ఇమ్మిగ్రేషన్ సంబంధిత ఆందోళనలు పెరుగుతున్నాయనే చర్చ మొదలైంది.








