E-PAPER

గండుగులపల్లి EMRS పాఠశాలలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ విద్యా యాత్ర – విద్యార్థులతో కలిసి భోజనం, తల్లిదండ్రులు-ఉపాధ్యాయులతో సమీక్ష


దమ్మపేట, ఆగస్టు 22 (వై7 న్యూస్): అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS)లో శనివారం నిర్వహించిన “నేను సైతం చేయూత – విద్యా యాత్ర మన ఎమ్మెల్యే, మన బడి” కార్యక్రమం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించింది. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని విద్యా వ్యవస్థ, విద్యార్థుల అభ్యాస పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువులు, భవిష్యత్ లక్ష్యాలు, విద్యా ప్రగతిపై ఆరా తీశారు. విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచిస్తూ, విద్య జీవితాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధమని వివరించారు. పిల్లల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.

అలాగే ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమై బోధన విధానాలు, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాల పెంపు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై చర్చించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల పిల్లలకు మెరుగైన విద్యా అవకాశాలు, వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే స్వయంగా విద్యార్థులకు టిఫిన్, భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. పిల్లలతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి ఆశయాలు, లక్ష్యాలను తెలుసుకొని ప్రోత్సహించారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందేలా సూచనలు చేస్తూ విద్యపై మరింత దృష్టి సారించాలని కోరారు.

కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఈద్దప్ప, మాజీ సర్పంచ్ మడకం రాజేష్, మాజీ సర్పంచ్ కారం సుధీర్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!