కొత్తగూడెం: నియోజకవర్గ పరిధిలోని పోస్టాఫీస్ సెంటర్ నుంచి శేషగిరినగర్ మీదుగా హేమచంద్రాపురం వరకు చేపట్టనున్న రూ.12 కోట్ల విలువైన రోడ్డు వెడల్పు, డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది. సింగరేణి పరిధిలో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
ఈ మార్గంలో సింగరేణి భారీ వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో రహదారి తీవ్రంగా దెబ్బతిని, వాహనదారులు మరియు స్థానిక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పరిస్థితిపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
రోడ్డు పునర్నిర్మాణం అవసరాన్ని సింగరేణి ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన ఎమ్మెల్యే, పనులు చేపట్టేలా నిరంతరం కృషి చేశారు. ఆయన పట్టుదలతో సింగరేణి యాజమాన్యం స్పందించి రూ.12 కోట్ల నిధులను మంజూరు చేసింది. అనంతరం పనుల నిర్వహణకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు.
అన్ని పరిపాలనా అనుమతులు పూర్తికావడంతో త్వరలోనే డబుల్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే పోస్టాఫీస్ సెంటర్ నుంచి హేమచంద్రాపురం వరకు రాకపోకలు మరింత సులభతరం కానుండటంతో పాటు ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. దుమ్ము, గుంతల సమస్యల నుంచి స్థానిక ప్రజలకు ఉపశమనం లభించనుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, పనులను త్వరితగతిన ప్రారంభించి నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసేలా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.








