మణుగూరు, ఆగస్టు 21 (వై7 న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో రోజురోజుకూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బిర్యానీ పాయింట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, టిఫిన్ సెంటర్ల సంఖ్య పెరుగుతోంది. అయితే ఆహార నాణ్యత ప్రమాణాల విషయంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చోటుచేసుకుంటున్న సంఘటనలు ప్రజల ఆరోగ్యంపై పెరుగుతున్న ముప్పును స్పష్టంగా తెలియజేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు.
కొన్ని రోజుల క్రితం పట్టణంలోని ఓ బిర్యానీ సెంటర్ నుంచి నూడుల్స్ కొనుగోలు చేసిన వినియోగదారుడు అందులో పురుగు కనిపించిందని ఆరోపించాడు. తాజాగా మరో స్వీట్ షాపులో కొనుగోలు చేసిన స్వీట్లు పాడైపోయిన స్థితిలో ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. ఈ విషయాలను షాపు యజమానుల దృష్టికి తీసుకెళ్తే, “మీ డబ్బులు తిరిగి తీసుకోండి” అని చెప్పి చేతులు దులుపుకుంటున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“డబ్బులు తిరిగి ఇవ్వడం సమస్యకు పరిష్కారం కాదు. ఆ పాడైన ఆహారం తిని పిల్లలకు లేదా కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వస్తే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు?” అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశంలో వ్యాపారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొంటున్నారు.
మణుగూరు పట్టణంలో వందల సంఖ్యలో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు, స్వీట్ షాపులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ఎప్పుడు జరిగాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఆహార పదార్థాల తయారీలో పరిశుభ్రత పాటిస్తున్నారా? వంట నూనెలను పదేపదే వినియోగిస్తున్నారా? నిల్వ ఉంచిన పదార్థాలు గడువు ముగిసినవేనా? నాణ్యత ప్రమాణాలు అమలు చేస్తున్నారా? వంటి అంశాలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని ప్రజలు కోరుతున్నారు.
ఇటీవల ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ హోటల్‌లో కొనుగోలు చేసిన బిర్యానీ నాణ్యత బాగోలేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి హోటల్‌కు వెళ్లి అక్కడ గొడవకు దిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడానికి ప్రధాన కారణం నాణ్యత నియంత్రణ వ్యవస్థ బలహీనపడటమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఫిర్యాదు వచ్చిన తర్వాత మాత్రమే స్పందించడం కాకుండా, ముందస్తు చర్యల ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఫుడ్ సేఫ్టీ శాఖపై ఉందని స్థానికులు అంటున్నారు. పట్టణంలోని అన్ని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్వీట్ షాపులు, బేకరీలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నాణ్యత ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన ఈ అంశంపై జిల్లా యంత్రాంగం, ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించి మణుగూరులో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని, నాణ్యత లేని ఆహార పదార్థాల విక్రయాన్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే భవిష్యత్తులో ఆహార కలుషితంతో పెద్ద ఎత్తున ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.








