E-PAPER

అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ వార్షిక తనిఖీలలో భాగంగా శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాల్వంచ డీఎస్పీ ఆర్. సతీష్ కుమార్ ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ, పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులు, ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

పోలీస్ స్టేషన్‌ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, ఫిర్యాదులతో వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ వారికి సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్టేషన్‌లోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరును సమీక్షించారు.

పేకాట, కోడిపందాలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసుల పురోగతిని సమీక్షించి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. చోరీకి గురైన ఆస్తుల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించి, నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని తెలిపారు.

మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్డీపీఎస్ కేసుల దర్యాప్తును సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.

సీసీటీఎన్ఎస్ 2.0లో కేసుల నమోదు, దర్యాప్తు వివరాలను సక్రమంగా అప్‌డేట్ చేయాలని, ఈ-సాక్ష్య, నాట్ గ్రిడ్, గాండీవ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను సమర్థంగా వినియోగించాలని ఆదేశించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

పెట్రోలింగ్‌ను మరింత పటిష్టం చేయాలని, బ్లూ కోల్ట్స్ వాహనాలతో ప్రజలకు అందుబాటులో ఉండాలని, డయల్-112కు కాల్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తక్షణ సహాయం అందించాలని పేర్కొన్నారు.

అనంతరం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ ఆర్. సతీష్ కుమార్, సీఐ నాగరాజు, ఎస్సైలు యయాతి రాజు, రాజేష్ తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!