వర్షాకాలంలో చేపల వంటకాలు తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. అయితే ఈ సీజన్లో నీటి కాలుష్యం పెరగడం, చేపల ప్రత్యుత్పత్తి కాలం కావడం వల్ల చేపలను ఎంపిక చేసుకునే విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సరైన నాణ్యత లేని చేపలను తినడం ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తున్నారు.
కలుషిత నీటిలో పెరిగిన చేపలు లేదా రసాయనాలతో ఎక్కువకాలం నిల్వ చేసిన చేపలను తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా, పరాన్నజీవులు, హానికర లోహాలు శరీరంలోకి చేరే ప్రమాదం ఉంటుంది. దీంతో ఫుడ్ పాయిజనింగ్, కడుపు సంబంధిత సమస్యలు, ఇతర ఆరోగ్య ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అందుకే తాజా చేపలను మాత్రమే కొనుగోలు చేయడం, వాటిని పూర్తిగా శుభ్రం చేసి బాగా ఉడికించి తినడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చేపల నాణ్యత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.








