E-PAPER

భద్రాచలం–వాజేడు రహదారికి మోక్షం కల్పించండి: మంత్రి తుమ్మల


వారం రోజుల్లో పనులు ప్రారంభం కాకపోతే కాంట్రాక్టర్ మార్పు చేయాలి: ఏపీ ఆర్‌అండ్‌బీ మంత్రికి విజ్ఞప్తి

భద్రాచలం, ఆగస్టు 6 (వై7 న్యూస్):
భద్రాచలం నుంచి వాజేడు వరకు అధ్వాన్నంగా మారిన రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టి ప్రజల కష్టాలను తొలగించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రోడ్లు–భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిని కోరారు.

బుధవారం ఈ మార్గంలో ప్రయాణించిన మంత్రి తుమ్మలను స్థానికులు అడ్డుకుని రహదారి దుస్థితిని వివరించారు. గతంలో నిర్మించిన ఈ రహదారికి ఎన్నో ఏళ్లుగా మరమ్మతులు చేపట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కేవలం 100 కిలోమీటర్ల ప్రయాణానికే మూడు గంటల సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల సమస్యలను తెలుసుకున్న వెంటనే మంత్రి తుమ్మల, ఏపీ ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, సంబంధిత అధికారులు, తెలంగాణ ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. రహదారి అభివృద్ధి పనులను అత్యవసరంగా ప్రారంభించి ప్రజల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

వారం రోజుల్లో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటానని మంత్రి తుమ్మల హామీ ఇవ్వడంతో స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు.

మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రహదారి అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు వచ్చినప్పటికీ కాంట్రాక్టర్ ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడం ఆందోళనకరమన్నారు. వారం రోజుల్లో పనులు ప్రారంభం కాకపోతే ప్రస్తుత కాంట్రాక్టర్‌ను తొలగించి కొత్త టెండర్ల ద్వారా పనులు చేపట్టాలని ఏపీ మంత్రిని కోరినట్లు తెలిపారు. దీనిపై మంత్రి జనార్దన్‌రెడ్డి సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

రూ.115.28 కోట్లతో రహదారి అభివృద్ధి

భద్రాచలం–వాజేడు రహదారి అభివృద్ధి పనులను మూడు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు.

భద్రాచలం–ఏటపాక (7.8 కి.మీ.) : రూ.3.70 కోట్లు

ఏటపాక–సుబ్బంపేట (56.8 కి.మీ.) : రూ.67.58 కోట్లు

సుబ్బంపేట–వాజేడు (48 కి.మీ.) : రూ.44 కోట్లు

మొత్తం 112.6 కిలోమీటర్ల పొడవున రూ.115.28 కోట్ల వ్యయంతో రహదారి అభివృద్ధి చేపట్టనున్నారు.

ఈ పనులను ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరెడ్డి, తెలంగాణ చీఫ్ ఇంజినీర్ బీవీ రావు పర్యవేక్షించనుండగా, భద్రాచలం మరియు ములుగు ఈఈలు క్షేత్రస్థాయిలో అమలును పర్యవేక్షించనున్నారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఈ రహదారిని వినియోగిస్తున్నందున, పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!