అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం గల్ఫ్ దేశాల చమురు ఎగుమతులపై పడుతోంది. ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషించే హార్ముజ్ జలసంధిలో భద్రతా ఆందోళనలు పెరగడంతో, ఈ మార్గంపై ఆధారపడకుండా చమురు, గ్యాస్‌ను ఎగుమతి చేసే ప్రత్యామ్నాయ మార్గాల కోసం గల్ఫ్ దేశాలు వేగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఇరాక్ ఇప్పటికే హార్ముజ్ జలసంధిని దాటాల్సిన అవసరం లేకుండా చమురు తరలించే భారీ పైప్‌లైన్ ప్రాజెక్టులను చేపట్టాయి. సౌదీ అరేబియా కూడా ఇదే తరహా ప్రాజెక్టుపై అధ్యయనం చేస్తుండగా, యూఏఈ కొత్త పోర్టు నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించింది.
గోల్డ్‌మన్ సాక్స్ విశ్లేషకురాలు అలెగ్జాండ్రా పాలస్ అంచనా ప్రకారం, 2027 చివరి నాటికి గల్ఫ్ దేశాలు యుద్ధానికి ముందు ఎగుమతి చేసిన చమురులో దాదాపు 45 శాతాన్ని హార్ముజ్ జలసంధిపై ఆధారపడకుండా ఎగుమతి చేసే సామర్థ్యాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ చర్యలు భవిష్యత్‌లో చమురు సరఫరాను మరింత స్థిరంగా ఉంచేందుకు దోహదపడనున్నాయి.








