సమగ్ర విచారణకు పీడీఎస్‌యూ డిమాండ్
పలాస ఆసుపత్రిలో విద్యార్థినిని పరామర్శించిన వినోద్ కుమార్
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఆశ్రమ పాఠశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచన
పలాస, జూలై 17 (వై7 న్యూస్):
శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం భరణికోట ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సవర నవ్యశ్రీ అనే విద్యార్థిని పాఠశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
గురువారం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఉపాధ్యాయుల మందలింపుల కారణంగానే విద్యార్థిని ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఘటనపై నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ నిర్వహించాలని కోరారు.
గాయపడిన విద్యార్థినికి అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల భద్రత, సంక్షేమం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించరాదన్నారు.
భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ సెషన్లు తరచూ నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల సమస్యలను సానుభూతితో అర్థం చేసుకుని పరిష్కరించే విధంగా ఉపాధ్యాయులు వ్యవహరించాలని, వారి మానసిక పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎం. వినోద్ కుమార్ పేర్కొన్నారు.









