E-PAPER

అరుణోదయ నాగన్నకు ఘన నివాళి

విప్లవ ప్రజా ఉద్యమాలకు ఉత్తేజం నింపిన నాగన్న గానం అజరామరం
సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటు: సన్నశెట్టి రాజశేఖర్

పలాస, జూలై 7 (వై7 న్యూస్): ఐదు దశాబ్దాలపాటు విప్లవ సాంస్కృతిక ఉద్యమానికి తన గళంతో చైతన్యం నింపిన అరుణోదయ వ్యవస్థాపక ప్రముఖుడు కామ్రేడ్ పరకాల నాగన్న మృతికి విప్లవ, ప్రజా సంఘాల నాయకులు, కవులు, రచయితలు, కళాకారులు ఘనంగా నివాళులర్పించారు. బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనంలో మంగళవారం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా హాజరైన అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ, “అరుణోదయ నాగన్న గళం నిత్య పోరాటాల స్వర జ్వలనం. ప్రజా ఉద్యమాలకు ఉత్తేజం నింపిన ఆయన గానం అజరామరం. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన విప్లవ నివాళి” అని అన్నారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగన్న జూలై 3న ఖమ్మంలో కన్నుమూశారని గుర్తు చేశారు. అరుణోదయ వ్యవస్థాపక త్రయం అయిన కానూరి, రామారావు, నాగన్నల్లో చివరిగా ఉన్న నాగన్న మరణంతో సాంస్కృతిక ఉద్యమం ఒక యుగాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు.

నిరుపేద కుటుంబంలో జన్మించిన నాగన్న, కమ్యూనిస్టు ఉద్యమాల ప్రభావంతో విప్లవ సాంస్కృతిక ఉద్యమంలో అడుగుపెట్టి పూర్తికాల కార్యకర్తగా ప్రజల మధ్య జీవించారని తెలిపారు. కవిగా, గాయకుడిగా, ఉద్యమకారుడిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ ఉద్యమం సహా అనేక ప్రజా ఉద్యమాల్లో తన గాత్రంతో చైతన్యం రగిలించిన మహోన్నత వ్యక్తిగా నాగన్న నిలిచారని చెప్పారు.

సభ ప్రారంభానికి ముందు నాగన్న చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు.

సంతాప సభలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, రైతు కూలీ సంఘం, ఐఎఫ్టీయూ, పీవోడబ్ల్యూ, ప్రజా కళామండలి, పిడిఎస్‌యూ తదితర విప్లవ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని నాగన్న సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో వంకల మాధవరావు, గొరకల బాలకృష్ణ, జుత్తు వీరాస్వామి, సవలాపురపు కృష్ణవేణి, బతకల ఈశ్వరమ్మ, పోతనపల్లి సుకుమతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు, కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News