శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కోసంగిపురం జంక్షన్ సమీపంలో కూటమి ప్రభుత్వం తొలి విడతలో సుమారు రూ.1.40 కోట్ల నిధులతో నిర్మించిన మయూర నగర వనంను బుధవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌తో కలిసి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వనాన్ని సందర్శించి అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, జాతీయ రహదారికి ఆనుకుని సుమారు 120 హెక్టార్ల విస్తీర్ణంలో ఆహ్లాదకర వాతావరణంతో అభివృద్ధి చేసిన ఈ మయూర వనం ప్రజలకు విశ్రాంతి, వినోద కేంద్రంగా ఉపయోగపడుతుందని అన్నారు. భవిష్యత్తులో దీనిని జంతు ప్రదర్శనశాల (జూ పార్క్)గా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు కోరనున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ, మయూర వనం ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10 ప్రవేశ రుసుము నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఏపీటీడీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరికట్ల విఠల్, ఏఎంసీ చైర్మన్ మల్ల శ్రీనివాస్, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేష్, మండల నాయకులు, అటవీశాఖ అధికారులు, ఆర్టీవో, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
– వై 7 న్యూస్, పలాస









