శ్రీకాకుళం, జూన్ 29 (వై7 న్యూస్):
ఆరో తరగతిలో చేరేందుకు మోడల్ స్కూల్లో సీటు ఇవ్వకపోవడంతో ఓ చిన్నారి జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ)ను ఆశ్రయించింది. శ్రీకాకుళంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ (గ్రీవెన్స్) కార్యక్రమంలో మందస మండలం గోపాలపురానికి చెందిన విద్యార్థిని తనుశ్రీ ఫిర్యాదు చేసింది.
తాను మోడల్ స్కూల్లో ఆరో తరగతిలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, నాన్-లోకల్ కేటగిరీ కారణంగా సీటు నిరాకరించారని ఆమె విన్నవించింది. ఈ విషయంపై సంబంధిత అధికారులను సంప్రదించినప్పటికీ పరిష్కారం లభించకపోవడంతో పీజీఆర్ఎస్ను ఆశ్రయించింది.
విద్యార్థిని ఫిర్యాదుపై స్పందించిన జాయింట్ కలెక్టర్, సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)కు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థినికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.








