భద్రాచలం, జూన్ 28:
ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, భవిష్యత్తులో అంగవైకల్యం బారిన పడకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి (ఏపీఓ) జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు.
ఆదివారం భద్రాచలం పట్టణంలోని సెయింట్ పాల్ హైస్కూల్లో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం మాట్లాడుతూ, పోలియో ఒక వైరస్ వ్యాధి అని, చిన్నారులకు సకాలంలో పోలియో చుక్కలు వేయడం ద్వారా వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని తెలిపారు.
పోలియో కారణంగా వచ్చే అంగవైకల్యాన్ని నివారించడంలో ఈ చుక్కలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు తోడ్పడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏడీఎంహెచ్‌వో సైదులు, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీధర్, పాయం శ్రీనివాస్, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
– సీనియర్ జర్నలిస్ట్ రాజేష్ తమ్మళ్ళ









