E-PAPER

స్విట్జర్లాండ్‌లో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ హత్యకు మొసాద్ కుట్ర.. జర్నలిస్ట్ సంచలన దావా!

ఇరాన్-అమెరికా శాంతి చర్చల కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను హత్య చేసేందుకు ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ ‘మొసాద్’ కుట్ర పన్నిందన్న వార్త అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, భౌగోళిక రాజకీయ విశ్లేషకుడు పెపే ఎస్కోబార్ ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ సంచలన విషయాలను బయటపెట్టారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశాల మేరకు.. మునీర్‌తో పాటు జెనీవాలో ఉన్న పాక్ దౌత్య బృందాన్ని మొత్తంగా అంతం చేయడానికి మొసాద్ పక్కా స్కెచ్ వేసిందని ఆయన తన దావాలో పేర్కొన్నారు.

అయితే, మొసాద్ పన్నిన ఈ భారీ కుట్రను పాకిస్థాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ముందుగానే పసిగట్టిందని ఎస్కోబార్ వెల్లడించారు. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ కుట్ర భోగట్టా తెలుసుకున్న పాక్ అధికారులు.. వెంటనే దౌత్య మార్గాల ద్వారా ఇజ్రాయెల్‌కు తీవ్ర స్థాయి వార్నింగ్ పంపినట్లు తెలిపారు. మధ్యవర్తుల ద్వారా.. “మా దౌత్య బృందంపై ఏమాత్రం చేయి పడినా, ప్రపంచపటం మీద ఇజ్రాయెల్ అనే దేశం లేకుండా చేస్తాం” అని పాకిస్థాన్ అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేసినట్లు సదరు జర్నలిస్ట్ స్పష్టం చేశారు.

ఈ తీవ్రమైన ఆరోపణలపై ఇటు ఇజ్రాయెల్ గానీ, అటు పాకిస్థాన్ ప్రభుత్వాలు గానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. పైగా, పాకిస్థాన్‌కు చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులు, భద్రతా అధికారులు ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తూ.. ఇదొక ఆధారాల్లేని అసత్య ప్రచారమని కొట్టిపారేశారు. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్న క్రమంలో ఇజ్రాయెల్‌పై పాక్ రక్షణ మంత్రి తీవ్ర విమర్శలు చేయడం, దానికి ఇజ్రాయెల్ గట్టిగా బదులివ్వడంతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఈ హత్య కుట్ర వార్తలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News