పుణే సమీపంలోని లోహగఢ్ కోట వద్ద యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయాడని మొదట భావించినప్పటికీ, ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కాబోయే భార్య సియా గోయల్ ఈ దారుణానికి ఒడిగట్టిందని దర్యాప్తులో తేలడంతో అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ప్రియుడితో కలిసి అతడిని అడ్డుతొలగించుకునేందుకు సియా ఈ కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో అంగీకరించింది.
సియాపై ప్రేమతో కేతన్ చేసిన భారీ ఏర్పాట్లు సైతం పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేశాయి. సియా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కేతన్ ఏకంగా ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో 70 గదులను బుక్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా, ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం బాలి వెళ్లేందుకు సన్నాహాలు చేయగా, సియా కావాలనే తన పాస్‌పోర్ట్ దాచిపెట్టి ఆ ట్రిప్‌ను రద్దు చేయించింది. రాబోయే నవంబర్‌లో రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో సుమారు రూ.17 కోట్ల ఖర్చుతో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిపేందుకు రెండు కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ఈ దారుణం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.
కేతన్‌ను హత్య చేయడానికి సియా, చేతన్‌లు ఇది వరకే ఒకసారి విఫలయత్నం చేసినట్లు దర్యాప్తులో తేలింది. జూన్ 14న కూడా లోహగఢ్ కోట వద్దకు తీసుకెళ్లి, అక్కడ పాము ఉందంటూ భయపెట్టి లోయలోకి నెట్టేందుకు ప్రయత్నించగా అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత జూన్ 18న సియా పుట్టినరోజు పేరుతో మరోసారి అక్కడికే ట్రెక్కింగ్ ప్లాన్ చేశారు. సరదాగా ఫోటోలు దిగుతున్న సమయంలో సియా, చేతన్ ఇద్దరూ కలిసి కేతన్‌ను వెనకనుంచి దాదాపు 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టేసి దారుణంగా హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.








