E-PAPER

‘మా ఇంటి బంగారం’ మూవీ రివ్యూ: సమంత వన్ ఉమెన్ షో.. ఆకట్టుకునే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్!

సుదీర్ఘ విరామం తర్వాత సమంత (Samantha) ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన తాజా యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం ‘మా ఇంటి బంగారం’. అనాథగా పెరిగిన స్వర్ణ (సమంత).. పెద్దింటి అబ్బాయి అనిరుధ్ (దిగంత్)ను ప్రేమ వివాహం చేసుకుంటుంది. ఈ పెళ్లి ఇష్టం లేని కుటుంబ సభ్యులు అతన్ని దూరం పెడతారు. ఎలాగైనా తన అత్తగారింటి వాళ్ళ మనసు గెలుచుకుని, అందరినీ కలుపుకోవాలనే లక్ష్యంతో స్వర్ణ ఆ ఇంట్లోకి అడుగుపెడుతుంది. అమాయకపు కోడలిగా అత్తారింట్లో అందరి ప్రేమను పొందే ప్రయత్నంలో ఉన్న స్వర్ణకు, ఊహించని విధంగా ఆమె గతానికి సంబంధించిన విలన్ కరుణ (గుల్షన్ దేవయ్య) నుంచి ముప్పు ఎదురవుతుంది. అసలు స్వర్ణ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? తన కుటుంబానికి వచ్చిన ఆపదను ఆమె ఎలా ఎదుర్కొంది? అన్నదే ఈ చిత్ర కథ.

ఈ సినిమాకి సమంత నటన అతిపెద్ద బలం. కామిక్ టైమింగ్, యాక్షన్, ఎమోషనల్.. ఇలా అన్ని వేరియేషన్స్‌ను అద్భుతంగా పండించి సినిమాను పూర్తిగా తన భుజాలపై మోసింది. ముఖ్యంగా చీరకట్టులో రౌడీలను చితకబాదే యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తాయి. స్నేహితురాలిగా కిరణ్మయి పాత్రలో మంజూష నవ్వించగా, విలన్‌గా గుల్షన్ దేవయ్య తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. హీరో దిగంత్, అలాగే ఇతర కీలక పాత్రల్లో నటించిన గౌతమి, శ్రీముఖి తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతికంగా సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ విజువల్స్ సినిమా స్థాయిని మరింత పెంచాయి.

దర్శకురాలు నందిని రెడ్డి ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ.. ఎక్కడా బోర్ కొట్టించకుండా ఎంటర్టైనింగ్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఫస్టాఫ్ అంతా అత్తారింట్లో సమంత పడే పాట్లు, ఫ్యామిలీ డ్రామా, అడపాదడపా కామెడీతో చాలా సరదాగా సాగిపోతుంది. అయితే సెకండాఫ్‌కి వచ్చేసరికి కథ కాస్త నెమ్మదించడం, విలన్ ట్రాక్ అనుకున్నంత బలంగా లేకపోవడం కాస్త నిరాశపరుస్తుంది. కథలో పెద్దగా కొత్తదనం లేకపోవడం, తర్వాత ఏం జరుగుతుందనేది ఊహకందేలా ఉండటం ఈ సినిమాకు మైనస్. అయినప్పటికీ, ఎమోషన్స్ వర్కౌట్ అవ్వడం, సమంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి ప్రాణం పోశాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే.. ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్‌లో థియేటర్లలో సరదాగా చూసి ఎంజాయ్ చేయదగ్గ డీసెంట్ ఎంటర్‌టైనర్ ఈ ‘మా ఇంటి బంగారం’.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!