వై7 న్యూస్ | భద్రాద్రి కొత్తగూడెం
ట్రాఫిక్‌కు అంతరాయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామ సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశా నుండి ఖమ్మం వైపు వెళ్తున్న గ్రానైట్ లారీ ప్రమాదవశాత్తు డివైడర్ ఎక్కి బోల్తా పడింది.
ఈ ఘటనలో లారీ లో ఉన్న భారీ గ్రానైట్ రాళ్లు రోడ్డుమధ్యకు చెల్లాచెదురుగా పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారి మధ్యలో పెద్ద రాయి పడివుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదే సమయంలో, రోడ్డుపై ఏర్పాటు చేసిన భారీ గేట్లను గమనించకుండా నిద్ర మత్తులో ఉన్న ఓ కారు డ్రైవర్ వాటిని ఢీకొట్టిన ఘటన కూడా చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికి పెద్దగా గాయాలు కాలేదని సమాచారం.
ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని భారీ గేట్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు.
ప్రమాదాలపై అప్రమత్తత అవసరం – స్థానికుల విజ్ఞప్తి
ఈ ఘటనతో మళ్లీ ఆ రహదారిపై భద్రతా చర్యల అవసరం ఎంతైనా ఉందని స్పష్టమవుతోంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.








