ప్రకృతికి ప్రతిఫలం చెల్లించేందుకు 1,116 మొక్కలతో లయన్స్ క్లబ్ సంకల్పం
తూప్రాన్, జూలై 29 (వై7 న్యూస్):
ప్రకృతితో మానవుని అనుబంధాన్ని పటిష్టపరిచే లక్ష్యంతో తూప్రాన్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వన మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. వర్షాకాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఆవరణలో 1,116 మొక్కలు నాటారు. ఈ మొక్కల సంరక్షణ బాధ్యతను లయన్స్ క్లబ్ స్వయంగా భుజాన వేసుకుంది.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త మాట్లాడుతూ, “వన మహోత్సవం అనేది వృక్ష (చెట్టు) మహోత్సవం. ఇది ఓ పండుగ కాదు, మన బాధ్యత. వర్షాకాలం ప్రారంభ సమయంలో మొక్కలు నాటడం వల్ల అవి జీవించడానికి, ఎదగడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం జూలై నెలలో దీన్ని ఒక యజ్ఞంలా జరుపుకోవాలి,” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సచిన్ చంద్ర చెట్ల ప్రాముఖ్యతను వివరిస్తూ… వాయు కాలుష్యం నియంత్రణ, మట్టిని కాపాడటం, వర్షాలను ఆకర్షించడం, జీవవైవిధ్యానికి స్థిరత కల్పించడం వంటి అంశాలను వివరించారు. చెట్ల పెంపకాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.
లయన్ డాక్టర్ జానకిరామ్ సిఆర్ మాట్లాడుతూ, వన మహోత్సవం ఒక్క పండుగగా కాకుండా, ప్రకృతి పట్ల మన కృతజ్ఞతగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కను నాటి దాన్ని పెంచాలన్న సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన జీవన వాతావరణం అందించాలంటే ఈ తరం ముందడుగు వేయాల్సిందేనని అన్నారు.
వన మహోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణంపై చైతన్యం కలిగించే లక్ష్యంతో లయన్స్ క్లబ్ పలు కార్యక్రమాలను చేపట్టనుంది. వ్యాసరచనలు, వాకృత్వ పోటీలు, ర్యాలీలు, పర్యావరణ ప్రచారాలు స్కూళ్లు, కళాశాలల మాధ్యమంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు.
ఈ వన మహోత్సవ కార్యక్రమంలో లయన్ నీల ప్రవీణ్ కుమార్ గుప్త, లయన్ డాక్టర్ అప్సర్ భాయ్, లయన్ కృష్ణా రెడ్డి, లయన్ మహమ్మద్ హమ్మద్ భాయ్, లయన్ కుమ్మరి రమేష్, లయన్ పల్లెర్ల బాలేష్ గుప్త, లయన్ నేతి సాగర్ గుప్త, లయన్ సుమంత్, ఆశాజ్యోతి డయాగ్నాస్టిక్ ఎండి లయన్ పచ్చిమట్ల మల్లేష్ గౌడ్, లయన్ మచ్చ యాదగిరి,ఆయుర్వేద ఆసుపత్రి వైద్య సిబ్బందిలో డాక్టర్ రాణి శర్మ, డాక్టర్ భవాని ప్రసాద్, డాక్టర్ పి.ప్రవీణ్, ఎం.వెంకటేశ్వర్ గౌడ్, కే.సౌజన్య, కే.శ్రీనివాస్, ఎం.సురేష్ (జూనియర్ అసిస్టెంట్), ఎస్.యాదయ్య, బి.వెంకటరమణ, ఎల్.సుష్మా, ఏ.కవిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.