పలాస, జూలై 20 (వై 7 న్యూస్)
శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో భారీగా అక్రమంగా రవాణా చేస్తున్న పశు మాంసం పోలీసులు పట్టుకున్నారు. శనివారం సాయంత్రం బిన్నాలా గ్రామం సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
మందస ఎస్‌ఐ కె. కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు రోడ్డుపై వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక మినీ వ్యాన్ పట్ల అనుమానం రావడంతో ఆపి జాగ్రత్తగా పరిశీలించగా, అందులో సుమారు ఐదు టన్నుల పశు మాంసం అక్రమంగా రవాణా అవుతున్నట్లు గుర్తించారు.
వాహనాన్ని నడుపుతున్న వ్యక్తిని రాజమండ్రికి చెందిన వెంకన్నగా గుర్తించారు. పశు మాంసాన్ని సరైన అనుమతులు లేకుండానే తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్‌ఐ కృష్ణప్రసాద్ తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని వారు పేర్కొన్నారు.