మణుగూరు, జులై 9 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆతృతగా ఎదురుచూస్తున్న పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఈనెల 12వ తేదీన కొత్తగూడెంలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
అయితే అదే రోజు మణుగూరు పర్యటన కూడా ఉంటుందా? అన్న దానిపై అధికారిక స్పష్టత లేకపోయినా… జిల్లా కాంగ్రెస్ నాయకులు గురజాల గోపి మాత్రం, “రేణుకా చౌదరిని ఖచ్చితంగా మణుగూరుకు తీసుకువస్తాను” అంటూ బలంగా ప్రకటించడంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపారు.
ఇటీవల వై సెవెన్ న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రేణుకా చౌదరి, “మణుగూరుకు తప్పకుండా వస్తాను… కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను తిరిగి కైవసం చేసుకుంటాను” అని చెప్పిన విషయం తెలిసిందే.
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మణుగూరు పర్యటనపై అధికారులు ఇంకా అనుమతి ఇవ్వలేదని, అక్కడి పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీయవచ్చన్న కారణంగా అనుమతి విషయంలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.
రేణుకా చౌదరి మణుగూరుకు వస్తారా? అక్కడ కార్యకర్తలతో సమావేశమవుతారా? అన్నది ఇంకా ఉత్కంఠ కలిగిస్తోంది. ఏదేమైనా ఈ పర్యటన రేణుకా చౌదరి రాజకీయ జీవితంలో కీలక మైలురాయిగా మారబోతోందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.