E-PAPER

యుద్ద ప్రాతిపదికన పునరుద్దరణ పనులు

• ముందస్తు చర్యల వల్ల మూడు వేల మందిని రక్షించాం

• రాష్ట్ర వ్యాప్తంగా 133 పునరావాస కేంద్రాలు

• వరద ప్రాంతాలల్లో ఆహారం, త్రాగునీరుకు ఏలోటు రావద్దు

• రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

తిరుమలయపాలెం / ఖమ్మం రూరల్

కష్ట కాలంలో ఉన్న ప్రజలను కాపాడుకునేందుకు వరద ప్రభావిత ప్రాంతాలల్లో యుద్ద ప్రాతిపదికన పునరుద్దరణ పనులు చేపట్టాలని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలు సహాయక చర్యలపై ఒకవైపు తన నియోజక వర్గం పాలేరులో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తూనే మరోవైపు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితులను మంగళవారం ఆయా జిల్లా కలెక్టర్లతో టెలిఫోన్ లో సమీక్షించారు. పాలేరు నియోజక వర్గంలోని ఖమ్మం రూరల్, తిరుమలయపాలెం మండలాలల్లో పర్యటించారు. గంట గంటకు హైదరాబాద్ లోని విపత్తుల నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడుతూ అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీచేస్తున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాలల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు కొనసాగించాలని మంత్రి గారు అధికారులను ఆదేశించారు. విపత్తుల నిర్వహణ విభాగంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు వస్తున్న ఫిర్యాదులు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగితెలుసుకున్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని పూర్తి వివరాలను జిల్లాల నుంచి తెప్పించుకోవాలని సూచించారు.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో 117 గ్రామాలలో 67 వేల మంది భారీ వర్షాలు, వరదల వల్ల ప్రభావితమయ్యారని, ఇందులో ఒక ఖమ్మం జిల్లాలోనే 49 వేల మంది ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 133 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి 10,538 మందిని తరలించడం జరిగిందని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలవల్ల 3039 మందిని రక్షించుకోగలిగామని తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఇప్పటి వరకు 44 ఇండ్లు పూర్తిగా దెబ్బతినగా 600 ఇండ్లవరకు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. అయితే ఇండ్లు పూర్తిగా కోల్పోయిన వారికి కొత్తగా మంజూరుచేయాలని, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు మరమ్మతులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 51 బ్రిడ్జిలు, 249 కల్వర్ట్స్, 166 ట్యాంక్ లు దెబ్బతిన్నాయని, 13,342 జీవాలు మృతి చెందాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలల్లో ఆహారం త్రాగునీరుకు ఏలోటు లేకుండా అందించాలని ఆదేశించారు. వరద భాదితులు ఎదురు చూడవలసిన పరిస్థితులు కల్పించకుండా సమహాయానికి ఆహారాన్ని అందించాలన్నారు.

వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అసలైన సవాలు ఇప్పుడు ఎదురవుతుందని మానవీయ కోణంలో సహాయ చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, పసిపిల్లలు, దివ్యాంగుల విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరికొన్ని రోజులు ఇదేవిధంగా అప్రమత్తంగా ఉండాలని, నష్ట పోయిన వారందరిని ఆదుకొంటూ కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవాలని అన్నారు.

ప్రతీ ఒక్కరూ మళ్లీ సాధారణ జీవితం గడిపేలా చరవేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు తగ్గడంతో వరదలు తగ్గుముఖం పట్టి బురదమయమైన ప్రాంతాలల్లో అంటువ్యాదులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!