యువత ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని మహా లింగేశ్వర గార్డెన్‌లో ఆదివారం జరిగిన మెగా జాబ్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ జాబ్ మేళాలో జిల్లాతో పాటు హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాలకు చెందిన 46 ప్రైవేటు కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్కడ ఏర్పాటు చేసిన సంస్థల స్టాల్స్‌ను సందర్శించారు. ఆయా సంస్థల్లో ఎవరెవరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, ఉద్యోగం ఎక్కడ చేస్తారు, వేతనాలు ఎంత ఉంటాయి, వసతి సౌకర్యం కల్పిస్తారా వంటి అంశాలను గమనించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఇటీవల టీచర్ల నియామకానికి మెగా డీఎస్సీ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించి, కీ కూడా విడుదల చేసిందని తెలిపారు. అలాగే, గ్రూప్-4 ఉద్యోగాలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుందని, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పూర్తిచేసి, మెయిన్స్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోందని, హైదరాబాద్‌లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు, ప్రైవేటు కంపెనీల్లో కూడా యువతకు కొలువులు అందించేందుకు ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, యువత వివిధ అంశాల్లో ప్రత్యేక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈక్రమంలో, గంజాయి మరియు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువతతో పాటు తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యులు కావాలని కోరారు.
జాబ్ మేళాలు ప్రతి ఆరు నుంచి ఎనిమిది నెలలకు ఒక్కసారి నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు..