E-PAPER

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్ మహిళ లక్ష్మి..!

ఆస్ట్రేలియా రాజకీయాల్లో తెలుగు మూలాలున్న మహిళ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన లక్ష్మి లంకల ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. స్థానిక సిడెన్‌హామ్  నియోజకవర్గం నుంచి ఆమె ‘ది రిపబ్లికన్’ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. విక్టోరియా రాష్ట్ర ఎన్నికలు నవంబర్ 28న జరగనున్నాయి. సిడెన్‌హామ్ అసెంబ్లీ స్థానానికి మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, బ్యాలెట్ పేపర్‌పై లక్ష్మి పేరు మూడో స్థానంలో ఉంది.

హైదరాబాద్‌తో అనుబంధం
లక్ష్మి లంకల విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే ప్రారంభమైంది. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ స్కూల్, కళాశాలలో ఆమె చదువుకున్నారు. అనంతరం ఢిల్లీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్యురాలిగా అర్హత సాధించారు. కర్ణాటకకు చెందిన మల్లేశ్‌ను వివాహం చేసుకున్న లక్ష్మి, ప్రస్తుతం ఆయనతో కలిసి ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. లక్ష్మి తల్లి ఎల్.కె. జయమ్మతో పాటు కుటుంబ సభ్యులు ప్రస్తుతం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉంటున్నారు. నగరానికి చెందిన మహిళ ఆస్ట్రేలియా వంటి దేశంలో చట్టసభ ఎన్నికల్లో పోటీ పడుతుండటంపై స్థానికులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రచారంలో ప్రధానాంశాలు
సిడెన్‌హామ్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం, ప్రాంతీయ అభివృద్ధి కోసం లక్ష్మి ప్రధానంగా నాలుగు అంశాలను తన ఎన్నికల ఎజెండాగా ఎంచుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు.

ప్రజా భద్రత: పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవడం.
రవాణా వ్యవస్థ: మెరుగైన రహదారులు, ప్రమాద రహిత కూడళ్ల నిర్మాణం, నమ్మకమైన ప్రజా రవాణా వ్యవస్థ మరియు మెరుగైన కనెక్టివిటీ కల్పించడం.
విద్యారంగం: పాఠశాలల్లో అత్యాధునిక మౌలిక వసతులు, అదనపు విద్యా వనరుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం.
వైద్యారోగ్యం: స్థానికంగా ఆసుపత్రులు, జీపీలు (జనరల్ ప్రాక్టీషనర్లు), అత్యవసర వైద్య సేవలు ప్రజలకు త్వరితగతిన, సులభంగా అందుబాటులో ఉండేలా చూడటం.

సిడెన్‌హామ్ నియోజకవర్గ ప్రజలనుద్దేశించి లక్ష్మి మాట్లాడుతూ.. స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో విని, కమ్యూనిటీ గళాన్ని అసెంబ్లీలో బలంగా వినిపించేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఈ ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు నిరంతరం శ్రమిస్తానని, ఓటర్లు తనను ఆదరించి గెలిపించాలని ఆమె కోరారు. స్థానిక ఓటర్లను నేరుగా కలుస్తూ ఆమె ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!