పుల్లగా, వగరుగా ఉందని ఉసిరికాయను పక్కనబెడుతున్నారా? అయితే మీరు పొరపాటు చేస్తున్నట్టే. ముఖ్యంగా చలికాలంలో ఉసిరి తప్పనిసరిగా తినాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఇమ్యూనిటీని మెరుగుపరచడం నుంచి చర్మానికి మేలు చేయడం వరకు ఉసిరితో చాలా లాభాలు ఉంటాయి. చలికాలంలో దీన్ని రెగ్యులర్‌గా తింటే చాలా సమస్యలు వచ్చే రిస్క్ తగ్గుతుందంటున్నారు. అసలు ఉసిరికాయ వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? చలికాలంలో తీసుకోవడం ఎందుకు అంత ముఖ్యం? ఎలా తినొచ్చు? అనే విషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
ఇమ్యూనిటీ మెరుగుదల :
చలికాలంలో ఉసిరికాయ తినడానికి మేజర్ రీజన్ ‘ఇమ్యూనిటీ’. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, జ్వరం లాంటి సీజనల్ రోగాలు ఈజీగా అటాక్ చేస్తాయి. వ్యాధి కారకాలతో రోగ నిరోధక వ్యవస్థ అంత మెరుగ్గా పోరాడలేకపోవచ్చు. అయితే, ఉసిరిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ శరీరానికి ఓ షీల్డ్‌లా పనిచేస్తాయి. ఇమ్యూనిటీని మెరుగ్గా ఉంచుతాయి. వైట్ బ్లడ్ సెల్స్‌ను యాక్టివేట్ చేస్తాయి. వైరస్లు, బ్యాక్టీరియాలపై శరీరం పోరాడే శక్తిని పెంచుతాయి. దీంతో ఉసిరి తీసుకుంటే చలికాలంలో సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.
జీర్ణక్రియ మెరుగ్గా ఉండేలా :
వింటర్లో చాలామందిలో జీర్ణవ్యవస్థ స్లో అవుతుంది. ఎందుకంటే చలి వల్ల ఉదయం కొందరు ఫిజికల్ యాక్టివిటీలు తగ్గించేస్తారు. ఈ కాలంలో ఫుడ్ కూడా ఎక్కువగా తినే అవకాశం కూడా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండడం వల్ల నీరు కూడా సరిగా తీసుకోరు. అందుకే అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వచ్చే ఛాన్స్ అధికం. ఉసిరికాయలో డైటరీ ఫైబర్ ఈ సమస్యలు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఇది గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది. పేగుల కదలికలను స్మూత్ చేసి, తీసుకున్న ఆహారం సులువుగా జీర్ణమయ్యేలా చేయగలదంటున్నారు నిపుణులు. అలాగే, శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటికి పోయేందుకు హెల్ప్ చేస్తుంది. జీర్ణవ్యవస్థ సాఫీగా పనిచేసేలా చూస్తుంది.
బ్లడ్ షుగర్ కంట్రోల్ :
బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేందుకు కూడా ఉసిరి తోడ్పడుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్న వారు శీతాకాలంలో తప్పనిసరిగా రోజుకో ఉసిరికాయ తినడం చాలా మేలు అంటున్నారు నిపుణులు. దీంట్లో ‘క్రోమియం’ అనే మినరల్ ఉంటుంది. ఇది గ్లూకోజ్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా కంట్రోల్లో ఉంటాయంటున్నారు.
ఎనర్జీ :
చలికాలంలో చాలామందికి ఏదో తెలియని బద్ధకంగా, ఎనర్జీ లేనట్టుగా అనిపిస్తుంది. బాడీ టెంపరేచర్ పడిపోవడమే దీనికి రీజన్. అందుకే ఈ సీజన్లో ఉసిరికాయ తింటే, బాడీ మెటబాలిజమ్ రేట్ మెరుగవుతుంది. శరీరానికి మంచి శక్తి దక్కుతుంది. శీతాకాలంలో ఉండే నిస్సత్తువను, అలసటను ఉసిరి తగ్గించగలదు. ఎనర్జిటిక్‌గా ఫీలయ్యేలా చేయగలదంటున్నారు.
గుండె ఆరోగ్యానికి మంచిది :
చలికాలంలో రక్తనాళాలు కుంచించుకుపోయి, గుండెపై ఎక్కువ భారం పడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఉసిరి తింటే గుండె పనితీరుకు మేలు జరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంట్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు బాడీలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్ను తగ్గించగలవు. ఉసిరికాయ రోజూ తింటే… ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ గ్రాడ్యుయల్‌గా తగ్గే ఛాన్స్ ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్స్ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేయగలవు. బ్లడ్ ప్రెషర్‌ను కంట్రోల్లో ఉంచగలవు. ఇలా గుండెకు కూడా ఉసిరి మేలు చేయగలదని చెబుతున్నారు.
చర్మానికి మెరుపు :
శీతాకాలంలో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. దీంతో చర్మం పొడిబారుతుంది. నిస్తేజంగా మారుతుంది. ఈ ప్రాబ్లమ్‌కు కూడా ఉసిరి మంచి సొల్యూషన్. ఉసిరిలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ‘కొల్లాజెన్’ ప్రొడక్షన్ పెంచుతుంది. దీంతో చర్మం తేమగా, కాంతివంతంగా ఉంటుందంటున్నారు.
జుట్టుకు మేలు :
చలికాలంలో హెయిర్‌ఫాల్, చుండ్రు సమస్యలు కొందరిలో పెరుగుతాయి. వీటికి చెక్ పెట్టడానికి ఉసిరికాయ సహాయపడుతుంది. ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు స్కాల్ప్‌కు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల జుట్టు కుదుళ్లు స్ట్రాంగ్ అవుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తి పెరగడం వల్ల కూడా స్కాల్ప్‌కు మేలు జరుగుతుంది. ఉసిరిలోని విటమిన్ C, ఇతర ఆహారాల్లో ఉండే ఐరన్‌ను శరీరంలో మెరుగ్గా గ్రహించేలా చేస్తుంది. ఇది కూడా జుట్టు ఆరోగ్యానికి హెల్ప్ చేయడంతో పాటు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందంటున్నారు నిపుణులు.









