హుజూర్నగర్: తమపై నిరాధార ఆరోపణలు చేస్తూ కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించడాన్ని సహించబోమని హుజూర్నగర్ మున్సిపాలిటీకి చెందిన మహిళా కౌన్సిలర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
హుజూర్నగర్ మున్సిపాలిటీలోని 11వ వార్డు కౌన్సిలర్ పులిచింతల వెంకట్ రెడ్డి ఈ నెల 4వ తేదీన కమిషనర్‌కు అందజేసిన ఫిర్యాదులో మహిళా కౌన్సిలర్లకు బదులుగా వారి భర్తలు అధికారిక కార్యక్రమాలు, చర్చల్లో పాల్గొంటున్నారని ఆరోపించినట్లు మహిళా కౌన్సిలర్లు తెలిపారు. ఈ ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు.
అధికారిక కౌన్సిల్ సమావేశాల్లో కౌన్సిలర్లు మాత్రమే పాల్గొంటున్నారని, తమ కుటుంబ సభ్యులు ఎవరూ సమావేశాల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తమ కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ ఫిర్యాదు చేయడం దురుద్దేశపూరితమని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఒకవేళ అధికారిక సమావేశాల్లో కౌన్సిలర్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారనే ఆరోపణల్లో వాస్తవం ఉంటే, వారిని సమావేశ మందిరంలోకి ఏ ప్రాతిపదికన అనుమతించారో మున్సిపల్ చైర్మన్, కమిషనర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా కౌన్సిలర్ల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించకుండా చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చి తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.
మహిళా ప్రజాప్రతినిధుల గౌరవం, ప్రతిష్ఠకు సంబంధించిన ఈ అంశంపై మున్సిపల్ అధికారులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.








