E-PAPER

దొంగతనాల నివారణకు పోలీసుల అప్రమత్తత.. హుజూర్‌నగర్‌లో మైక్ ప్రచారం

హుజూర్‌నగర్: మిర్యాలగూడ ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్న ‘థార్ గ్యాంగ్’ సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో హుజూర్‌నగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ముఠా తమ పరిధిలోకి ప్రవేశించే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా మైక్ ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు పలు సూచనలు చేశారు. గ్రామాలు, పట్టణ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, కొత్త వ్యక్తుల సంచారం అనుమానాస్పదంగా ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఈ సందర్భంగా దొంగతనాల నివారణకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. ఇళ్లకు నాణ్యమైన భద్రతా తాళాలు ఏర్పాటు చేసుకోవాలని, రాత్రి వేళల్లో ఇంటి బయట వెలుతురు ఉండేలా లైట్లు ఆన్‌లో ఉంచుకోవాలని తెలిపారు. అపరిచిత వ్యక్తులు లేదా అనుమానాస్పద ముఠాల కదలికలు గుర్తించినప్పుడు ఆలస్యం చేయకుండా స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజల ఆస్తులు, ప్రాణాల భద్రతకు పోలీస్ శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తోందని, ఎలాంటి అనుమానాస్పద సమాచారం అందినా తక్షణమే స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు వెల్లడించారు.

ప్రజల అప్రమత్తతే దొంగతనాల నివారణలో కీలకమని పోలీసులు సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!