మద్యం నిల్వలు, విక్రయ రికార్డుల పరిశీలన.. నిబంధనలు పాటించాలని సూచన
కరకగూడెం, అక్టోబర్ 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని పలు వైన్ షాపుల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో మద్యం దుకాణాల్లోని నిల్వలు, విక్రయాలకు సంబంధించిన రికార్డులు, ప్రభుత్వ నిబంధనల అమలు తీరును పరిశీలించారు.
మద్యం విక్రయాల్లో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని అధికారులు సూచించినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడకుండా వ్యాపారాలు నిర్వహించాలని స్పష్టం చేసినట్లు తెలిసింది.
మండలంలోని వైన్ షాపుల్లో ఎక్సైజ్ అధికారుల ఆకస్మిక తనిఖీలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే, తనిఖీల్లో ఏవైనా ఉల్లంఘనలు గుర్తించారా? అనే విషయంపై అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది.








