ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కుతున్న వైనం
పోలవరం జిల్లా,(వై7 న్యూస్ తెలుగు), అక్టోబర్ 28:
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకొని, పోలవరం జిల్లా రంపచోడవరం కేంద్రంగా గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తూ బహుళంతస్తుల అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎన్నికల బిజీలో ఉన్నామనే సాకుతో అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహణను నిలిపివేయడమే కాకుండా, ఏజెన్సీ ప్రాంతంలో రాత్రింబవళ్లు జరుగుతున్న ఈ అక్రమ కట్టడాలను పట్టించుకోవడం లేదని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను తీవ్రంగా ఆరోపించారు.

గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అక్రమ నిర్మాణాలను నిలిపివేయకపోగా, అదే వ్యక్తులు ప్రస్తుతం మరింత రెచ్చిపోయి మల్టిపుల్ బిల్డింగ్లు మరియు బహుళ అంతస్తులను నిర్మిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ నిర్మాణాలకు స్థానిక పంచాయతీ కార్యదర్శి అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎవరిని ప్రశ్నించినా “ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు ఎన్నికల బిజీలో ఉన్నారు, డిసెంబర్ వరకు ఎటువంటి ఫిర్యాదులు తీసుకోము” అనే నిర్లక్ష్యపు సమాధానాలే వస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
చట్టబద్ధమైన ఏజెన్సీ రక్షణలు, 1/70 చట్టం అమల్లో ఉన్నప్పటికీ అధికారుల మౌనం కారణంగా నాన్-ట్రైబల్స్ ఇష్టానుసారంగా కట్టడాలు వెలువరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి, నిబంధనలను ఉల్లంఘించి రంపచోవరంలో సాగుతున్న అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కుంజ శ్రీను డిమాండ్ చేశారు.








