E-PAPER

భద్రాచలం కరకట్ట వద్ద ముగ్గురు యువకుల అరెస్ట్

గంజాయి సేవించినట్లు అనుమానం.. పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ

భద్రాచలం, అక్టోబర్ 19: భద్రాచలం పట్టణంలోని గోదావరి కరకట్ట దిగువన రెడ్డి సత్రం సమీపంలో గంజాయి సేవించినట్లు అనుమానంతో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 9:15 గంటల సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులను చూసి ముగ్గురు యువకులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం పోలీసుల వద్ద ఉన్న గంజాయి టెస్టింగ్ కిట్లతో పరీక్షలు నిర్వహించగా, ముగ్గురికీ పాజిటివ్‌గా వచ్చినట్లు పోలీసుల ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ముగ్గురిని అరెస్ట్ చేసి డీ-అడిక్షన్ కేంద్రానికి పంపించినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల పర్యవేక్షణలో ప్రత్యేక చర్యలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజు ఆదేశాల మేరకు, భద్రాచలం డీఎస్పీ ఎం. అరుణ్ కుమార్ సూచనలతో, భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రాజు పర్యవేక్షణలో ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పెట్రోలింగ్‌లో ఎస్‌ఐ వి. సతీష్ పాల్గొన్నారు.

గంజాయిపై సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి

గంజాయి సేవించడం, విక్రయించడం, అక్రమంగా రవాణా చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గంజాయి సంబంధిత కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి సారించాలని భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రాజు సూచించినట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!