E-PAPER

ఆస్ట్రేలియాలో వింత పరిస్థితి..! చల్లదనం కోసం ఎయిర్ పోర్టులోకి వస్తున్న పాములు..!

ఆస్ట్రేలియాలోని ఓ విమానాశ్రయంలో ఊహించని పరిణామం ప్రయాణికులను, సిబ్బందిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సెంట్రల్ ఆస్ట్రేలియాలోని ఆలిస్ స్ప్రింగ్స్ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ భవనంలోకి పదుల సంఖ్యలో విషపూరిత పాములు ప్రవేశిస్తున్నాయి. ప్రయాణికులు సేద తీరే క్వాంటాస్ లాంజ్, చెక్-ఇన్ ప్రాంతాలు, సిబ్బంది కార్యాలయాల్లోనూ ఇవి సంచరిస్తుండటంతో కలకలం రేగింది. వేసవి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ సమస్య మరింత తీవ్రమైంది.

విషయం తెలుసుకున్న స్నేక్ క్యాచర్ రెక్స్ నీన్‌డార్ఫ్ బృందం వెంటనే రంగంలోకి దిగింది. ఎయిర్‌పోర్ట్‌లోని పలు ప్రాంతాల నుంచి ఇప్పటికే అనేక పాములను పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పట్టుబడిన వాటిలో అత్యంత విషపూరితమైన వెస్టర్న్ బ్రౌన్ స్నేక్స్‌తో పాటు, తక్కువ ప్రమాదకరమైన విప్ స్నేక్స్ కూడా ఉన్నాయి. అయితే, ఇప్పటివరకు పాముల కారణంగా ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

నార్తర్న్ టెరిటరీ ప్రాంతంలో విపరీతంగా పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు, చల్లదనం కోసం పాములు భవనాల్లోకి ఆశ్రయం కోసం వస్తున్నాయని కన్జర్వేషన్ బయాలజిస్ట్ క్రిస్ జాలీ తెలిపారు. పాములు సహజ ఆవాసాలు, మానవ నిర్మిత కట్టడాల మధ్య తేడాను గుర్తించలేవని, చల్లగా ఉండే ప్రదేశం ఎక్కడ దొరికితే అక్కడికి వెళతాయని వివరించారు. పగటిపూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండటంతో, చల్లబడిన తర్వాత రాత్రి, సాయంత్రం వేళల్లో ఇవి ఎక్కువగా బయటకు వస్తున్నట్లు గుర్తించారు.

ఈ పరిణామంతో ఆలిస్ స్ప్రింగ్స్, డార్విన్, టెనెంట్ క్రీక్ విమానాశ్రయాలను నిర్వహించే ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ గ్రూప్ అప్రమత్తమైంది. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు, నిపుణులైన స్నేక్ క్యాచర్ల సేవలను వినియోగించుకుంటోంది. సిబ్బందికి కూడా పాముల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు. ఎక్కడైనా పాము కనిపిస్తే, సురక్షిత దూరం పాటించాలని, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించవద్దని, వెంటనే నిపుణులకు సమాచారం ఇవ్వాలని స్థానిక అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!