టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఇటీవల ఇరుముడి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఇరుముడి సినిమాతో చాలా సంవత్సరాల తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ తన తదుపరి సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ ఒక కామెడీ హారర్ త్రిల్లర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే..
రవితేజ ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన జోనర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఇలా కామెడీ హర్రర్ ద్వారా మొదటిసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాకు ఇటీవల టైటిల్ కూడా ఖరారు చేశారని తెలుస్తోంది. ఈ సినిమాకు “తులాభారం”(Thulabaram)అనే టైటిల్ ఫిక్స్ చేశారని త్వరలోనే అధికారికంగా వెల్లడించబోతున్నారని తెలుస్తుంది.
ఇకపోతే తాజాగా ఈ సినిమా నటీనటులకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో రవితేజకు జోడిగా ప్రముఖ నటి ప్రియాంక మోహన్ హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటించగా, ప్రముఖ నటి అనస్వర రాజన్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం టాలీవుడ్ సీనియర్ హీరోని ఎంపిక చేశారని తెలుస్తోంది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జెడి చక్రవర్తి(J.D. Chakravarthy) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోగా పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్న ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా జె.డి చక్రవర్తి సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వివేక్ ఆత్రేయ రవితేజ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తులాభారం సినిమాలో ఈయన విలన్ పాత్రలో నటించడం కోసం జెడి చక్రవర్తిని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే జెడి చక్రవర్తిని కలిసి కథ వివరించగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలుస్తుంది. రవితేజకు విలన్ గా జె.డి చక్రవర్తి అంటే ఇదొక క్రేజీ కాంబినేషన్ అని చెప్పాలి. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి చిత్ర బృందం అధికారక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు జరుపుకోబోతుందని సమాచారం.








