E-PAPER

రేప్ చేస్తే చస్తామనే భయం పుట్టించాలి’..! మహిళల భద్రతపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..!

మహిళలపై నేరాలకు పాల్పడే సామాజిక వ్యతిరేక శక్తుల మనసుల్లో భయాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, నేరాలు జరగకుండా నివారించడమే అత్యంత ముఖ్యమని ఢిల్లీ పోలీసులకు హితవు పలికింది. ఇటీవల ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో వరుసగా చోటుచేసుకున్న అత్యాచార ఘటనలపై సుమోటోగా విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

విచారణ సందర్భంగా పోలీసుల పనితీరుపై పలు సూచనలు చేసింది. విచారణ సందర్భంగా జస్టిస్ పార్థీవాలా మాట్లాడుతూ.. “మహిళలపై దాడులకు పాల్పడాలనుకునే దుండగులకు తాము పట్టుబడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ఉండాలి. అలాంటి వాతావరణాన్ని మీరు కల్పించాలి” అని పోలీసులను ఆదేశించారు. 

నేరాలను అరికట్టేందుకు నివారణ చర్యలను మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా న్యాయ‌స్థానం నొక్కి చెప్పింది. ఢిల్లీలో మహిళల భద్రతకు సంబంధించి పలు నిర్దిష్ఠ‌ ఆదేశాలను ధర్మాసనం జారీ చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో బీట్ పెట్రోలింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని, వెలుతురు సరిగా లేని ప్రదేశాలను గుర్తించి వెంటనే లైటింగ్ సౌకర్యం మెరుగుపరచాలని సూచించింది. 

అలాగే, నిఘా వ్యవస్థలను పటిష్ఠం చేయాలని తెలిపింది. దుండగులు, పోకిరీలు ఎక్కువగా గుమికూడే అక్రమ తినుబండారాల కేంద్రాలు, మద్యం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ముఖ్యంగా విద్యాసంస్థల సమీపంలో అమ్మాయిలను వేధించే వారిపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేసింది.

దేశ రాజధాని పరిధిలో మైనర్లపై జరిగిన లైంగిక దాడులతో సహా వరుస అత్యాచార ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది. గతంలో కూడా కోర్టు మహిళల భద్రతపై ఆడిట్ నిర్వహించాలని, ఇతర తాత్కాలిక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజా విచారణలో తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!